ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంతమందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల), రాతి పృదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో, దొంగ నేల మీద, మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.