పులిజూదం లేదా పులి-మేక ఒక భారతదేశపు సాంప్రదాయ ఆట. విశేష ఆదరణ గల ఒక గ్రామీణ క్రీడ. ఇది చదరంగం వలె ఆడు ఆట. ఒకనాడు పల్లెల్లో మేధావి తనానికి నిరూపణగా ఈ ఆటను ఆడేవారు. గ్రామీణ ప్రాంతాలలో, విరామ సమయాలలో నేటికీ ఈ ఆటను ఆడటాన్ని చూడవచ్చు. గ్రామ కూడలిలో, రచ్చబండ దగ్గరో, మరో చెట్టుకిందో, దేవాలయపు కట్టల మీదో, ఇంటి అరుగుల మీదో ఎక్కడో ఒక చోట ఒక ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉండే ఏ ప్రాంతంలోనైనా ఈ ఆట ఆడుతూ పల్లెల్లో జనాలు కనిపిస్తారు.
ఈ ఆటను తమిళనాడులో ఆడు పులి ఆట్టమ్ అని, కర్ణాటకలో హుళి గట్ట లేదా ఆడు-హుళి అని వ్యవహరిస్తారు. దక్షిణ ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆటను ఆడతారు. సుమాత్రాలో ఈ ఆటను మ్యూరిమ్యుయెంగ్-రిమ్యూయెంగ్-దో (meurimüeng-rimüeng-do) అంటారు. దీన్ని సాంప్రదాయకమైన గడిలోనే ఆడతారు కానీ, ఈ ఆటలో ఐదు పులులు, పదిహేను మేకలు ఉంటాయి. మధ్య చిత్రంలో సూచించిన పెద్దగడిలో మూడు పులులు, పదిహేను కుక్కలతో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రఫాయా అన్న ఆటను ఆడతారు. శ్రీలంకలో ఇదే ఆటను దేమల దివియన్ కేళియ అంటారు. ఈ పెద్ద గడితో ఆడే ఆట సాంప్రదాయ పులిజూదం ఆటకంటే కొద్దిగ ఎక్కువసేపు సాగుతుంది.
ఈ ఆట ఆడుటకు కావలసినవి...
పులి జూదం చిత్రం
నాలుగు గచ్చకాయలు
పద్దెనిమిది చింత బిచ్చలు.
పులి జూదం చిత్రం రెండు అభిముఖ లంబకోణ త్రిభుజాల సమ్మేళనం. దీనిలో రెండు దీర్ఘచతురస్రాలు అడ్డంగా అమరి ఉంటాయి. పులి జూదం చిత్రాన్ని కొందరు లావుపాటి అట్ట మీద గీసుకొని ఆడుతారు. ఎక్కువమంది, పరిచిన బండలపై పులి జూదం చిత్రాన్ని గీసి, ఆడుతారు. గచ్చకాయలకు, చింత బిచ్చలు (చింతపిచ్చలు) బదులుగా వాటి పరిమాణంలోని రాళ్ళతో కూడా ఆడుతారు. గచ్చకాయలు, చింత బిచ్చల సంఖ్య కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండటాన్ని గమనించ వచ్చు. గచ్చకాయలను పులులుగా, చింత బిచ్చలను మేకలుగా వ్యవహరిస్తారు.
ఈ ఆట ఇద్దరు మాత్రమే ఆడే వీలు ఉంటుంది. ఆ ఇద్దరికి పక్కవాళ్ళు మద్దతుదారులుగా సలహాలు ఇవ్వవచ్చు.
పులి జూదం ఇద్దరు మాత్రమే ఆడాలి.
ఆటగాళ్ళలో ఒకరు గచ్చకాయల (పులుల) తో, మరొకరు చింతబిచ్చల (మేకల) తో ఆడాలి.
త్రిభుజాకారంలోని మధ్య గీతపై నాలుగు పులులు ముందుగానే పెట్ట బడి ఉంటాయి.
ముందుగా మేకలతో ఆడే వ్యక్తి పులలకి అన్ని వైపుల సమీపంలోని బిందువలను వదిలిపెట్టి, తరువాతి బిందువు స్థానంలో ఒక మేకను ఉంచుతాడు.
పులలతో ఆడే వ్యక్తి తరువాత ఒక పులిని మేక సమీపానికి దగ్గరలోని బిందువు దగ్గరకు జరుపుతాడు.
మేకలతో ఆడే వ్యక్తి మరో మేకను పులలకు దూరంగా ఇంకో చోట ఉంచుతాడు.
ఈ విధంగా 18 (18:4;15:3;1:3) మేకలు అయిపోయెవరకు మేకలతో ఆడేవాడు పెడుతూ పోతే, పులతో ఆడేవాడు జరుపుతూ పోతాడు. తదుపరి ఆట రసకందాయకంలో పడుతుంది. పులికి సమీపంలో ఏదేని మేక ఉండి దాని తరువాత బిందువు ఖాలిగా ఉంటే మేకను, పులి చంపుతుంది. ఆవిధంగా మేకలను ఎక్కువగా పులులు చంపుతూ పోతే పులులతో ఆడేవాడు గెలిచినట్లు. పులులు ఎక్కడకు కదలటానికి వీలులేకుండా మేకలతో బందిస్తే మేకలతో ఆడేవాడు గెలిచినట్లు.
ఆటగాళ్ళు: యిద్దరు, కావలసినవి: 3-పులులు, 15-మేకలు
పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.
పులి జూదంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఈ ఆటను ఆడే చిత్రాన్ని బట్టి, ఆడే కాయల సంఖ్యను బట్టి ఈ రకాలు ఉన్నాయి.
ఒక పులి పులి జూదం: ఆడటానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ ఆటను ఆడుతారు. చాలా తక్కువ సమయంలో ఈ ఆట ముగుస్తుంది. మూడు మేకలతో పులిని కట్టడి చేస్తారు. చేయలేకపోతే పులితో ఆడేవారు గెలిచినట్లు. ఈ ఆట తెలుగు ప్రాంతాలు అన్ని చోట్లా ఆడిన దాఖాలాలు ఉన్నాయి.
మూడు పులులు పులి జూదం: ఈ ఆటను 3 పులులు, 15 మేకలతో ఆడుతారు. ఈ ఆటను ఉత్తర సర్కారు జిల్లాలలో ఆడుతారు.
నాలుగు పులుల పులి జూదం: ఈ ఆటలో 4 పులులు, 18 మేకలతో ఈ ఆటను ఆడుతారు. ఈ ఆట దక్షిణ తెలంగాణాలోను, రాయలసీమలోనూ చూడవచ్చు.
ఈ ఆటలు కాకతీయుల కాలం నాటి నుండి ఉన్నట్లు తెలుస్తుందొ.[4]. తరువాత రెడ్డి రాజుల పాలనలో మరింత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రజలకు వినోద వ్యాపకాలుగా మారాయి. కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశికలో ఒక చోట ... "తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ సాగటాల నే నతి ప్రౌఢుండన్.[5]. ఈ పుస్తకంలో కవి మూడు రకాల పులి జూదములు కలవని గోపరాజు పేర్కొన్నట్టు ప్రతాపరెడ్డి చెప్పాడు. అవి ఒక పులి జూదం, నాలుగు పులల జూదం. మూడవది స్పస్టంగా పేర్కొనలేదని ప్రతాపరెడ్డి చెప్పాడు. అయితే మూడవ ఆటపై సందిగ్థతలో ఉన్నప్పుడు రెడ్డికి సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి వాసి తాడేపల్లి కృష్ణమూర్తి 3 పులుల ఆటను చూసించారు. చదరంగానికి ఏ విధంగానూ తీసిపోని ఈ ఆట పిల్లల ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుదనుటలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
1వ రకం-పులిజూదం
3వ రకం-పులిజూదం
3వ రకం-పులిజూదం
పులిజూదం తరహా ఆటలు ఎడమ నుండి కుడికి 1) సాంప్రదాయ పులిజూదం గడి, 2) భారతదేశంలో ఆడే రఫియా, శ్రీలంకలో ఆడే దేమల దివియన్ కేళియ యొక్క గడి 3) థాయ్‌లాండ్‌లో ఆడే లెన్ చోవా గడి.