శ్రీ కృష్ణుడు మేలుకొలుపు పాట
బంగారు చెంబులో పన్నీరుపట్టుక
పణతి రుక్మణివచ్చె మేలుకో,
దంతకాష్ఠము బూని తామరసాక్షి సు
దంత వచ్చినాది మేలుకో||
వాసుదేవ భక్త వరజన పోషక
వసుదేవ నందన లేరా
కంస సంహార ఖగరాజ గమనుడ
కరిరాజ వరదుడా లేరా||
ఘోరమయిన సంసారబాధ గడ
తేరలేరు జనులు మేలుకో
దారిజూపి వారి దరిజేర్చకున్న నె
వ్వారు దిక్కు స్వామి మేలుకో||
శ్రీ కృష్ణుడు మేలుకొలుపు పాట
తెల్ల వారవచ్చె పల్లవాధరనీదు
వుల్లము రంజిల్ల మేలుకో
గొల్లల ఇండ్లలో వెన్న లారగించ
వేళాయె శ్రీకృష్ణ మేలుకో
తెల్లవారవచ్చెనూ||
పూతన చనుదాలు పుక్కిటగొనిదాని
పాతక మణచాలి మేలుకో
ఘాతుక దానవుల నూతనపు చిన్నెల
ఖ్యాతిగదును మాడ మేలుకో
తెల్లవారవచ్చెనూ||
రేపల్లెవాడలో గోపకామినులకు
తాపములణచాలి మేలుకో
కూరిమితో కంసుని కొలువుకూటంబున
కూలదన్నవలె మేలుకో
నీపాదపద్మముల నరులకు చూపించి
పరము నందించంగ మేలుకో||
మేలుకొలుపులలో రచయితలపేర్లు కూడా ఇమిడి కనబడడముతో వాటి 'రచన' చక్కగా ధ్వనిస్తుంది.లాలిపాటలు, పిల్లల ఆటగేయాలు ఎవరు రాశారన్న ప్రశ్న పుట్టదు.కాని మేలుకొలుపులు అవసరముకోసము ఆవిర్భవించినవి కావు, పూని రచించినవి.అందుకే రచయిత పేరు! తత్వపు మేలుకొలుపు 'జీవా మేలుకో' అన్నది రచించి నాతడు వెంకట శివరామదాసు.ఇతని భాష పండితుల భాషే.యతులూ ప్రాసలు చక్కగా వేసినాడు.